అనకాపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన విశాలాంద్ర విలేకరి పి.గోవిందుపై ఈనెల 19న జరిగిన హత్యాయత్యాన్ని ఖండిస్తూ, నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబులు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో ఽగురువారం ధర్నా చేసి, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిదిలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ అక్రమాలపై వార్తలను ప్రచురించినందుకే జర్నలిస్టు గోవిందుపై దాడి చేయడం అన్నాయమన్నారు. దాడికి సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడు గుడివాడ కృష్ణపై అక్కడ పోలీసులు నేటి వరకూ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అజయ్, బి.కొండలరావు, సీహెచ్.శశికుమార్, కాండ్రేగుల మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


