దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం చేసి మూతపడే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులు, కార్మికుల బకాయి రూ. 38 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చెరకు రైతు, కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోన్ని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం మూడు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో అత్యధికంగా ఉన్న రైతులు, కూలీలు ఉన్నారని వీరికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. రైతులు పూర్తిగా చెరకు పంట పండించే కోల్పోయే విధంగా చేసిందన్నారు. ఒక వైపు ఫ్యాక్టరీ మూసివేయగా మరో వైపు ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు నేటికీ బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ ప్రాంత రైతాంగం చెరకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. బకాయిల కోసం రైతులు, కార్మికులు సంక్రాంతి పూట 23 రోజులు ఆఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించి బకాయి చెల్లింపునకు స్పష్టమైన హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారన్నారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, సంక్షోభంలో ఉన్న రైతులు, కూలీలను ఆదుకొని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


