విశాఖ లీగల్: కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా జపాన్, బెల్జియం, అమెరికా దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇంటర్న్స్ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానంపై అవగాహన పొందేందుకు భారత్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు జిల్లా కోర్టుతో పాటు న్యాయవాదుల చాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ, కోర్టుల పనితీరు, న్యాయ ప్రక్రియలు, న్యాయవాదుల విధుల గురించి వివరాలు తెలుసుకున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ఆచరణాత్మక విధానాన్ని, కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు తెలిపారు.సాంస్కృతిక మార్పిడి ద్వారా విదేశీ యువతకు భారతీయ సంప్రదాయాలు, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నీ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గాలి రామిరెడ్డి, సీనియర్ మెంబర్ యు. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ. సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


