గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పోరాటమే | - | Sakshi
Sakshi News home page

గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పోరాటమే

Aug 25 2026 12:45 AM | Updated on Aug 25 2026 12:45 AM

పాఠశాల తరలింపు నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలి

తల్లిదండ్రుల కమిటీతో కలిసి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు స్పష్టీకరణ

విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ

మధురవాడ: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే గిరిజన సమాజం తరఫున మరింత తీవ్రంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. మధురవాడ మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న 480 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సోమవారం తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రవిబాబు హాజరై మాట్లాడారు. తాము సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే వేపగుంట సమీపంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సీవోఈ ఏర్పాటు పేరుతో మైదాన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలను మూసివేసి, 480 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడం సరికాదన్నారు.

నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం

2004లో ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, బలవంతంగా టీసీలు ఇవ్వడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటిని మెరుగుపరచాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల హక్కుల కోసం గిరిజనుడిగా, ప్రజాప్రతినిధిగా ముందుండి పోరాడతానని తెలిపారు. పాఠశాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోకపోతే తల్లిదండ్రులు, ఆదివాసీ–గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులను సబ్బవరం, దేవరాపల్లి, శ్రీకృష్ణాపురం తదితర పాఠశాలలకు మార్చుకోవచ్చని అధికారులు సూచించినప్పటికీ, తమ పిల్లలను ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగించాలని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement