నగరంలోని మార్వాడీల సంప్రదాయ సిద్ధంగా ఆదివారం కావడి యాత్ర నిర్వహించారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, విశ్వశాంతి నెలకొనాలని కోరుతూ వీరు ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఈ కావడి యాత్రను చేపడతారు. ఈసారి యాత్ర రోజు ఏకాదశి కావడంతో ఆదివారం కావడి యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు మొదట మాధవదార శివాలయంలో శివుడిని దర్శించుకున్న అనంతరం కావిళ్లతో బయలుదేరారు. మురళీనగర్, ఊర్వశి కూడలి మీదుగా జాతీయ రహదారిపై సుమారు రెండువేల కుటుంబాలు భారీ సంఖ్యలో ఊరేగింపుగా బీచ్‌రోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వరకు కావడి యాత్రను కొనసాగించినట్టు మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు విష్ణు రాటేరియా తెలిపారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కావడి యాత్రతో నగరం భక్తి రస ప్రవాహంగా మారింది.
– మురళీనగర్


