కందుల దందా | - | Sakshi
Sakshi News home page

కందుల దందా

Aug 24 2026 12:25 AM | Updated on Aug 24 2026 12:25 AM

రూ.200 టికెట్ల పేరిట అనధికార వసూళ్లు

కనకమహాలక్ష్మి ఆలయంలో చైర్మన్‌ కందుల నాగరాజు ఏకపక్ష పెత్తనం

దేవదాయ శాఖ నిబంధనలకు పాతర

ఎమ్మెల్యే పేరు వాడుకుంటూ భక్తులకు మాయమాటలు

డాబాగార్డెన్స్‌: కనకమహాలక్ష్మి దేవస్థానం వివాదాలకు నిలయంగా మారుతోంది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ కందుల నాగరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఆలయం నాదే... నే చెప్పిందే వేదం’ అనే ధోరణితో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అటు పాలకమండలి సభ్యులకు, ఇటు ఆలయ అధికారులకు, చివరకు అర్చక సిబ్బందికి సైతం తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆయన సాగిస్తున్న వ్యవహార శైలిపై భక్తజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే పేరుమీద..

తాజాగా మార్గశిర మాస ఉత్సవాల వేళ చైర్మన్‌ నాగరాజు తీసుకున్న నిర్ణయం ఆలయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. డిసెంబర్‌ 27న నిర్వహించ తలపెట్టిన మార్గశిర సహస్ర కలశాభిషేకం (మార్గశిర రథయాత్ర) పేరిట దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ఆమోదం తెలపకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు శ్రీకారం చుట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహిళలకు ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించడమే కాకుండా, ఈ అనధికారిక కరపత్రాలపై దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత పేర్లను ముద్రించడం గమనార్హం. ఎమ్మెల్యే చేతుల మీదుగానే యాత్ర ప్రారంభమవుతుందంటూ భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఆది నుంచి వివాదస్పదమే..

చైర్మన్‌ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాల పరంపర ఈనాటిది కాదు. గత జూన్‌ నెలలోనే ఆలయ పవిత్రతను భంగపరుస్తూ, కాళ్లకు పాదరక్షలతో దేవుని ప్రాంగణంలోకి ప్రవేశించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటన మరవకముందే ఈ కొత్త వివాదం ముసిరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాతతో పాటు ఇతర సిబ్బందితో కనీస సమన్వయం లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆలయ పరిపాలన దారి తప్పింది. ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారులు సైతం మౌనం వహించడంతో ఛైర్మన్‌ వైఖరి మరింత శ్రుతిమించుతోందని పాలకమండలి సభ్యులే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగిస్తున్న ఈ అనధికారిక టికెట్ల విక్రయాలను, ఆర్థిక లావాదేవీలను వెంటనే నిలిపివేసి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సత్వరమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వ అనుమతులు

లేకుండానే..

చట్ట ప్రకారం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఏదేని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రతిపాదనలను కార్యాలయం ద్వారా దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపి, ప్రభుత్వ పూర్వానుమతి పొందాకే ఎలాంటి రుసుములు లేదా టికెట్లను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి దస్త్రాలు తమ కార్యాలయానికి రాలేదని ఆలయ సిబ్బందే స్పష్టం చేస్తుండటం చైర్మన్‌ అక్రమ విధానాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలకు తెరదీయడం చట్టవిరుద్ధమని తెలిసినా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చైర్మన్‌ ఇలా వ్యవహరించడం శోచనీయం.

గర్వంతో విర్ర వీగకూడదు

ఆలయ వ్యవహారాల్లో ఏకపక్ష ధోరణి, అనధికారిక నిర్ణయాలు సరికావు. ట్రస్ట్‌ బోర్డు బాధ్యతల్లో ఉన్నవారు దేవదాయ శాఖ నిబంధనలకు లోబడి భక్తులకు సేవకులుగా మాత్రమే పనిచేయాలి తప్ప, ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే గర్వంతో విర్రవీగకూడదు. దేవదాయ శాఖ డీసీ హోదా కలిగిన అధికారి అధికారికంగా అనుమతించి విడుదల చేయాల్సిన సేవా టికెట్లను, ప్రభుత్వ ఆమోదం లేకుండా చైర్మన్‌ సొంతంగా ముద్రించి విక్రయించడం స్పష్టమైన చట్ట ఉల్లంఘన. అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ, అనధికారిక రుసుములతో భక్తులను దేవునికి దూరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం మరియు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.

–విజయశంకర్‌ ఫణీంద్ర, కో–కన్వీనర్‌, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement