● 1500 క్యూసెక్కుల విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా, ఆదివారం నాటికి అది 2587.07 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటి మట్టం క్రమేణా పెరుగుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది, 6వ నెంబర్ గేటును ఒక అడుగు పైకెత్తి 1,500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలాశయానికి ప్రమాదం తప్పదని భావించిన ప్రాజెక్టు అధికారులు మరియు సిబ్బంది, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు.


