వంట కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

వంట కష్టాలు!

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

గ్యాస్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో వంట కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థులకు భోజనం వండాల్సిన సిబ్బంది గ్యాస్‌ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.. సరఫరా కాకపోతే కట్టెల పొయ్యినే ఆశ్రయించాల్సిన దుస్థితి. అవసరానికి తగ్గ సిలిండర్లు అందకపోవడం, కొన్ని పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్‌ రాకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.
ఆశ్రమ పాఠశాలల్లో

కొయ్యూరు: ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్‌ కొరత వంట సిబ్బందికి తలబొప్పి కట్టిస్తోంది. వారానికి అవసరమైన గ్యాస్‌ సిలిండర్లలో సగం కూడా అందకపోవడంతో పలు పాఠశాలల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్‌ సరఫరా కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలకు చింతపల్లి జీసీసీ నుంచి హెచ్‌పీ గ్యాస్‌ సరఫరా అవుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి 6 నుంచి 8 సిలిండర్లు అవసరం కాగా, ప్రస్తుతం రెండింటికి మించి ఇవ్వడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. నడింపాలెం, శరభన్నపాలెం ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్‌ సరఫరా కావడం లేదని పేర్కొంటున్నారు.

వర్షం వస్తే.. కట్టెలతో మరింత కష్టం!

గ్యాస్‌ అందకపోవడంతో వంట చెరకు వినియోగించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఎండిన కట్టెలు కొంతమేర దొరుకుతున్నా.. వర్షాలు కురిస్తే తడిసిన కట్టెలతో వంట చేయడం మరింత ఇబ్బందికరంగా మారుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆశ్రమ పాఠశాలల్లో వంట సిబ్బంది వృద్ధులు కావడంతో కట్టెల పొయ్యిపై గంటల తరబడి వంట చేయడం వారికి మరింత భారంగా మారుతోంది.

జీసీసీ సరఫరాపై అసంతృప్తి..

మరో ఏజెన్సీకి మార్పు?

ఇతర గ్యాస్‌ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నప్పటికీ జీసీసీ నుంచి హెచ్‌పీ గ్యాస్‌ సక్రమంగా అందడం లేదని అధికారులు, వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేదని, గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిందని పేర్కొంటున్నారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖాధికారులు మరో గ్యాస్‌ ఏజెన్సీకి సరఫరాను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డెన్లు నిబంధనల ప్రకారం అవసరమైన గ్యాస్‌ కోసం ముందుగానే ఫారం పూర్తి చేసి గ్యాస్‌ పర్యవేక్షకునికి అందించాలని సూచించారు.

గ్యాస్‌ కొరతతో అవస్థలు

వినియోగంలో సగం కూడా అందనిసిలిండర్లు

వారానికి రెండుకు మించిఇవ్వడం లేదంటున్న వార్డెన్లు

జీసీసీ ఏజెన్సీ సరఫరాపై అసంతృప్తి

మరో ఏజెన్సీకి మార్చే యోచనలో

గిరిజన సంక్షేమశాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement