సీఎం గారూ.. మాకు ఒరిగిందేమిటి? | - | Sakshi
Sakshi News home page

సీఎం గారూ.. మాకు ఒరిగిందేమిటి?

Aug 23 2026 12:22 AM | Updated on Aug 23 2026 12:22 AM

సాక్షి, అనకాపల్లి/కె.కోటపాడు: అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనతో స్థానిక ప్రజలకు, జిల్లా వాసులకు ఒరిగేందేమి లేదు. స్థానిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రకటన లేదు. అభివృద్ధి పనులకు నిధులపై హామీ లేదు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం అధికారులపై నెట్టే ప్రయత్నం కనిపించిందని ప్రజలు చెబుతున్నారు. ‘సీఎం గారూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మా రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడొస్తుంది?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అధికారులే బాధ్యులు : ప్రజల సమస్యలకు పరిష్కారం, అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీ ఇవ్వడం కంటే ప్రభుత్వ శాఖల పనితీరుపై విమర్శలు చేయడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ డిపార్ట్‌మెంట్ల పనితీరు సరిగా లేదంటూ అధికారులపై రుబాబు ప్రదర్శించారు. ప్రభుత్వమే తగిన నిధులు విడుదల చేయకపోతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత, ప్రభుత్వ వైఫల్యాలను పక్కనపెట్టి అధికారుల పనితీరుపై నెపం మోపే ప్రయత్నం చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. సూపర్‌ సిక్స్‌లో అరకొరగా అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, సీ్త్ర శక్తి పథకంలో లోపాలను అధికారులపై నెట్టే యత్నం చేశారు. అంతేకాకుండా వివిధ విభాగాల వారీగా జిల్లా అధికారుల పనితీరును బహిరంగ సభలో సీఎం ప్రశ్నించారు. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మైనింగ్‌ శాఖ, పురపాలక శాఖ అధికారుల పురోగతి బాలేదంటూ రుబాబు చేశారు. ప్రభుత్వమే తగిన నిధులివ్వకపోతే అధికారులు సైతం ఏమి చేస్తారంటూ ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై రుద్దేందుకే ఈ సభ నిర్వహించినట్టుగా ఉందని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది.

రోడ్లు బాలేదంటూ నిరసన : సీఎం సభలో ప్రజల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయంటూ చంద్రబాబు చెబుతూ.. అర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈను పిలవగా.. రోడ్లు బాగోలేదంటూ పలువురు ప్రజలు చేతులూపుతూ నిరసన తెలిపారు. దీంతో రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే మీరు సరిగ్గా ఎందుకు వేయలేదంటూ ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లపై సీఎం రుసరుసలాడారు. ఒక వైపు ప్రజలు సమస్యలను గుర్తు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే సభలో నుంచి పలువురు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

గంట ఆలస్యంగా పర్యటన : సీఎం చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఎ.కోడూరు చేరుకోవాల్సి ఉంది. పలు గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలను ఎ.కోడూరుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక వైపు చిరుజల్లులు పడుతున్నా.. బయటకు వెళ్లకుండా వారిని సభలోనే బలవంతంగా నిలిపివేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు, ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. సీఎం ప్రసంగం పూర్తయినంత వరకూ ఉండాలని టీడీపీ నాయకులు కోరుతున్నా ఎవరూ వినిపించుకోకపోవడం విశేషం.

సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు మళ్లీ నిరాశే మిగిల్చింది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో ఎప్పటిలాగే చంద్రబాబు డాబూ..డూబూ అంటూ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుండడంతో ఎన్నికలకు ముందు కె.కోటపాడు వేదికగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సీఎం ఏమైనా ప్రకటన చేస్తారని, స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తారని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది. ఎన్నికల హామీల ప్రస్తావనకే చోటు లేకపోవడంతో ‘సీఎం గారూ.. మా సమస్యల పరిష్కారం ఎప్పుడో?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం చేయడంతో అంతా విస్తుపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement