రివర్స్ ఆపరేషన్
గంజాయి స్మగ్లర్ల ఆగడాలకు చెక్
గుట్టురట్టు చేస్తున్న నార్కోటిక్స్ అధికారులు
ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న పోలీసులు
నిఘా వ్యవస్థలో సరికొత్త మార్పులు
ముంచంగిపుట్టు పోలీసు స్టేషన్
ముంచంగిపుట్టు: పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో గంజాయి రవాణా చేసే స్మగ్లర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. సాధారణంగా గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్మగ్లర్లు పోలీసుల కదలికలను గమనించడానికి ఏకంగా ‘నిఘా వ్యవస్థను’ ఏర్పాటు చేసుకున్నారు.
స్మగ్లర్ల కొత్త ఎత్తుగడలు..
గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. పోలీసులు ఏ జంక్షన్ వద్ద ఉన్నారు, ఎక్కడ తనిఖీలు చేస్తున్నారు అన్నది తెలియక దొరికిపోతున్నామని గ్రహించిన స్మగ్లర్లు తమ వ్యూహాన్ని మార్చారు. తమకు కావాల్సిన సమాచారం కోసం స్థానిక యువతను ఎంచుకున్నట్టు సమాచారం. మండల కేంద్రాల్లోని కొంతమంది యువకులకు నెలకు రూ. 10 వేల చొప్పున ఇచ్చి, పోలీసుల కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.
● పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు ఎప్పుడు బయలుదేరుతున్నారు.. ఎంతమంది వెళ్తున్నారు అనే వివరాలను స్మగ్లర్లకు చేరవేస్తున్నారు. ఆ సమాచారం ఆధారంగానే, గంజాయిని ఏ మార్గంలో, ఏ సమయంలో తరలించాలో స్మగ్లర్లు పథకాలు వేస్తున్నారు. దీనికి తోడు, గంజాయి వాహనానికి ముందుగా పైలట్ వాహనాన్ని నడుపుతూ రూట్ క్లియరెన్స్ కోసం అమాయక గిరిజన యువతకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు డబ్బు ఆశ చూపి ఉచ్చులో దించుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇలా వారి ప్రలోభాలకు గురైన గిరిజన యువత చివరకు పోలీసులకు పట్టుబడి, జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
నార్కోటిక్స్ అధికారుల దాడి
పోలీసులపై స్మగ్లర్లు నిఘా పెడుతున్న విషయాన్ని ఇటీవల పోలీసులు గుర్తించారు. ఈ నెల 20న భూసిపుట్టు నుంచి ముంచంగిపుట్టు మీదుగా ఒడిశాకు గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, పోలీసులు రాత్రంతా మాటు వేశారు. తెల్లవారుజాము వరకు ఏ వాహనం రాకపోవడంతో వారు స్టేషన్లకు తిరిగి వెళ్లారు. అయితే, ఇదే సమయంలో స్మగ్లర్లు తవుడు బస్తాల కింద 1200 కేజీల గంజాయిని దాచి తరలిస్తుండగా, పెదపుట్టు వద్ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కారు.
● స్థానిక పోలీసులపై నిఘా పెట్టిన స్మగ్లర్లు, విశాఖపట్నం నుంచి వచ్చిన నార్కోటిక్స్ అధికారుల ఉనికిని గుర్తించలేకపోయారు. విచారణలో స్మగ్లర్లు పోలీసుల కదలికలపై నిఘా పెట్టిన విషయాన్ని బయటపెట్టారు. సమాచారం చేరవేస్తున్న వ్యక్తులు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరి ఆట కట్టించేందుకు పోలీసులు ఇప్పుడు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
స్మగ్లర్ల ప్రలోభాలకు గురి కావద్దు
గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం దృష్టి పెడుతున్నాం. భవిష్యత్తును నాశనం చేసే గంజాయిపై దూరంగా ఉండేలా గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు గిరిజన యువతకు గంజాయి స్మగ్లర్లు ఆశ చూపి వారిని వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని గిరిజన యువత గ్రహించాలి. గంజాయి రవాణా,సాగుకు దూరంగా ఉండాలి. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడమే కాకుండా వారి ఆటకట్టిస్తాం.
– ఎస్.లక్ష్మణరావు, సీఐ, జి.మాడుగుల


