● పరమసింగవరంలో ఇంటింటికీ జ్వరాలు
● మంచంపట్టిన గిరిజనులు
● వైద్యం కోసం అల్లాడుతున్న వైనం
సీలేరు: జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంత గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు కలకలం రేపుతున్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక, వైద్యం అందక గిరిజనులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు చిట్టచివరి సరిహద్దు గ్రామమైన గుమ్మురేవులు పంచాయతీ పరిధిలోని పరమ శింగవరం గ్రామంలో పరిస్థితి దయనీయంగా ఉంది.
కొండ కోనల మధ్య వైద్యం అందని ద్రాక్ష
గుమ్మురేవులు పంచాయతీ కేంద్రం నుంచి పులుసు మామిడి మీదుగా పరమ శింగవరం గ్రామానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గంలో సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడమే గిరిజనుల ప్రధాన సమస్య. దారిలో మూడు చిన్న వాగులు, మూడు పెద్ద గడ్డలు దాటుకుంటూ, మూడు కిలోమీటర్ల మేర ప్రమాదకరమైన కొండ అంచు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది.
ఇంటికో రోగి.. మంచం పట్టిన బాధితులు
సుమారు 15 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో ప్రస్తుతం పలువురు మలేరియా, ఇతర వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం గ్రామంలో ఆరుగురు పిల్లలు, 11 మంది పెద్దలు తీవ్ర జ్వరాలతో మంచాన పడ్డారు. ప్రకాష్ అనే యువకుడు, చిన్న అమ్ములు అనే మహిళ మలేరియాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారకొండ పంచాయతీ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు మార్గం లేకపోవడంతో, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తప్పని పరిస్థితుల్లో ఆర్‌ఎంపీ సాయం
ప్రభుత్వ వైద్యులు గ్రామానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. చివరకు జిల్లా సరిహద్దులోని వై.రామవరం మండలం, పొతవరం గ్రామానికి చెందిన ఒక ఆర్‌ఎంపీని పిలిపించి ప్రకాష్ అనే యువకుడికి చికిత్స అందించారు. వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి, పరమ శింగవరం గ్రామంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల ప్రాణాలను కాపాడాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


