సాధారణంగా చలికాలంలో మాత్రమే దర్శనమిచ్చే పొగమంచు, వేసవిలోనూ మన్యం ప్రాంతాన్ని పలకరించింది. శనివారం పాడేరు, అరకులోయ, చింతపల్లి ప్రాంతాలను దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ఎండలు మండిపోవాల్సిన వేళ, అకస్మాత్తుగా ఏర్పడిన ఈ మంచు తెరలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేశాయి. ఉదయం నుంచే మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఏమాత్రం కనిపించక వాహన చోదకులు ప్రమాదాలను నివారించేందుకు తమ వాహనాలకు లైట్లు వేసి, నెమ్మదిగా రాకపోకలు సాగించారు. వేసవిలో ఈ చల్లని అనుభూతి పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు పండగలా మారింది. మంచు తెరల వెనుక నుంచి ప్రకృతి అందాలు మెరిసిపోతుంటే, ఆ దృశ్యాలను కళ్లారా చూసి పర్యాటకులు పులకించిపోయారు. అరకు, చింతపల్లి వంటి ప్రాంతాల్లోని కొండ కోనలు మంచులో మునిగిపోయి, ఊటీని తలపించేలా అద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరించాయి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తమ కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు వచ్చిన వారికి ఈ పొగమంచు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది.
– సాక్షి, పాడేరు


