కొయ్యూరులో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

కొయ్యూరులో భారీ వర్షం

Jun 28 2026 2:32 AM | Updated on Jun 28 2026 2:32 AM

రాజేంద్రపాలెంలో వర్షం నీటితో నిండిన రోడ్డు

కొయ్యూరు: శనివారం కొయ్యూరులో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం సుమారు గంటపాటు కురిసింది. ఈ వర్షంతో మండలంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.గత కొద్ది రోజులుగా వర్షాలు లేక ఆకుమడులు వేయలేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. పొలాలను దున్నడానికి, ఆకుమడులు సిద్ధం చేసుకోవడానికి ఈ వర్షం ఎంతో అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో మండల కేంద్రంలోని రాజేంద్రపాలెం రోడ్డు నీటితో నిండిపోయింది. దీంతో వాహనచోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, వర్షం ధాటికి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకాశంలో పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు రావడంతో పిడుగులు పడతాయేమోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

సీలేరు: జిల్లా ఏజెన్సీ పరిధిలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో శనివారం వింత వాతావరణం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 7 గంటల సమయంలో అరగంట పాటు ఓ మోస్తరు వర్షం కురవగా, ఆ తర్వాత సాయంత్రం వరకు ఎండ తీవ్రత కొనసాగింది. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో మళ్ళీ జల్లులు కురిసి ఆగిపోయాయి. మధ్యాహ్న సమయంలో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూన్‌ నెల ముగుస్తున్నా, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న అడపాదడపా వర్షాలతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సీలేరుతో పాటు దుప్పులవాడ, దారకొండ, గుమ్మరేవుల, అమ్మవారి దారకొండ తదితర పంచాయతీల పరిధిలో గిరిజన రైతులు పొలం పనులను ముమ్మరం చేశారు.

డుంబ్రిగుడ: మండల కేంద్రంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. సుమారు 11 గంటల వరకు వర్షం దంచికొట్టడంతో జనజీవనం స్తంభించింది. ఈ వర్షం కారణంగా చాపరాయి పర్యాటక ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు, అరకు–పాడేరు మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లోకి చేరింది. దీనివల్ల వ్యాపారులకు ఆర్థికంగా నష్టం వాటిల్లడంతో పాటు ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, ప్రధాన బజారులో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement