మన్యం అందాలు ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మన్యం అందాలు ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యం

Jun 28 2026 2:32 AM | Updated on Jun 28 2026 2:32 AM

చింతపల్లి: మన్యం ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నామని వాల్తేర్‌ ఫొటోగ్రఫీ సొసైటీ కార్యదర్శి ఎంవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈనెల 29న జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా, సొసైటీ ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలంలో ఫొటోగ్రాఫర్లు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఫొటోగ్రాఫర్లు తాజంగి, కృష్ణాపురం, లంబసింగి, చింతపల్లి మరియు కొత్తపల్లి ప్రాంతాల్లోని ప్రకృతి సౌందర్యాన్ని, ల్యాండ్‌స్కేప్‌లను తమ కెమెరాలలో బంధించారు. జాతీయ కెమెరా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, చీరాల, చైన్నె, హైదరాబాద్‌, ఢిల్లీ నుంచి వచ్చిన సుమారు 30 మంది ఫొటోగ్రాఫర్లు చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ వర్క్‌షాపులో భాగంగా మన్యం ప్రాంతపు ప్రకృతి అందాలు, ఆదివాసీల జీవనశైలి, వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఫొటోలు తీస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ తీసిన ఫొటోలను ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సెమినార్‌, ప్రత్యేక ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మన్యంలోని ప్రకృతి వైభవాన్ని పర్యాటక ప్రేమికులకు చేరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్‌ ఫొటోగ్రఫీ సొసైటీ ప్రతినిధులు ఎస్‌.శ్రీనివాసరావు, ఎస్‌. రాము, సతీష్‌, సత్యనారాయణ, సన్నీ, బాలాజీ, టరాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాల్తేర్‌ ఫొటోగ్రఫీ సొసైటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement