దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ? | - | Sakshi
Sakshi News home page

దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ ?

Jun 28 2026 2:32 AM | Updated on Jun 28 2026 2:32 AM

● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త ధర్మశ్రీ

మునగపాక: కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ దోచుకోవడం,దాచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేశారో చెప్పాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే 33 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే విజయకుమార్‌ చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ గతంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన రాంబిల్లి మండలం పంచదార్లలో విలువైన కొండలను తవ్వేస్తూ అక్రమార్జనకు పాల్పడిన సంగతి నియోజకవర్గ ప్రజలకు తెలుసని చెప్పారు. పూడిమడకలో జెట్టీ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ హయాంలో నిధులు మంజూరు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెట్టీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా గంగాదేవిపేట నుంచి మునగపాక వరకు ఉన్న సాగునీటి కాలువలను కప్పేసి రైతులను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా కాలువలను కప్పేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. యలమంచిలి నుంచి అచ్యుతాపురం మీదుగా పరవాడకు రహదారి విస్తరణ చేస్తామంటూ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడంలో ఎమ్మెల్యే విజయకుమార్‌ విఫలమయ్యారని విమర్శించారు. కాపు యువకుడు సాయికృష్ణ మృతి వెనుక ఎంతోమంది పోలీసుల పాత్ర ఉందని, వారి వెనుక ఉన్న నేతల ప్రమేయంపై ప్రభుత్వం ఎందుకు నిగ్గు తేల్చడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు కుల రాజకీయం చేయడం విచారకరమన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాటతీరు సరిగ్గా లేదని, సినిమాల్లో పవన్‌కల్యాణ్‌ యాక్టింగ్‌ చేసినట్లు రాజకీయంగా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. కూటమి నాయకుల అన్యాయాలు, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,వైస్‌ ఎంపీపీ మళ్ల కాశీ సురేష్‌, రాంబిల్లి మాజీ ఎంపీపీ తిరుపతిరావు,పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కాండ్రేగుల జగన్‌,శరగడం జగన్నాథరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement