అనకాపల్లి: పలు చోరీ కేసుల్లో నిందితురాలిని అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ జి.ప్రమ్‌కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సబ్బవరం నుంచి అనకాపల్లి వస్తున్న ఆటోలోంచి గంటా మీనా అనే మహిళ దిగి వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి విచారణ చేయగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామం 202 కాలనీకి చెందిన మీనా ఆటోల్లో ప్రయాణిస్తూ పలు చోరీలకు పాల్పడినట్టు చెప్పారు. ఈనెల 11న అనకాపల్లి పట్టణం భీమునిగుమ్మం ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరి సంచిని బ్లేడ్‌తో కోసి అందులోని రూ.20వేలు నగదు చోరీకి చేసినట్టు తెలిపారు. ఈనెల 17న విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఆటోఎక్కి ఒక మహిళ మెడలో సుమారు రెండున్నర తులాల బంగారు మంగళ సూత్రాలతో కూడిన పుస్తెల తాడును దొంగలించినట్లు చెప్పారు. నిందితురాలి నుంచి రెండు చోరీలకు సంబంధించి రెండున్నర తులాల బంగారం, రూ.14వేలు నగదు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. విలేకరుల సమావేశంలో క్రైం ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


