అచ్యుతాపురం రూరల్ : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్న పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్నీడి కృష్ణమోహన్‌కు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ 5 పదులు దాటిన వయస్సులో సుమారు 6500 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం చేసి శిఖరం అధిరోహించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సాధించిన విజయం ఉపాధ్యాయ వర్గానికే కాకుండా విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయులు కృష్ణమోహన్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఆయన భవిష్యత్తులో మరిని విజయాలు సాధించి దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు రవికుమార్, జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు, గణేష్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


