కశింకోట: జిల్లాలో అనంత అరణ్య కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. తాళ్లపాలెం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో అనంత అరణ్య కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో 70 వేల మొక్కలు నాటుతున్నట్టు చెప్పారు. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో 1,650 మొక్కలు నాటినట్టు తెలిపారు. విద్యార్థులు, ప్రజలు విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటారు. డ్వామా పీడీ నిర్మలదేవి, అడిషనల్ పీడీ మణికుమార్, ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖరరావు, ఏపీవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.


