మాచ్‌ఖండ్‌కు నీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మాచ్‌ఖండ్‌కు నీటి కష్టాలు

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

జలవిద్యుత్‌ కేంద్రంలో ప్యానల్‌ బోర్డు ఏర్పాటు పనుల్లో సిబ్బంది

పూర్తిగా అడుగంటిపోయిన జోలాపుట్టు జలాశయం స్పిల్‌వే (ఇన్‌సెట్‌) మాచ్‌ఖండ్‌

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడు ఏళ్లుగా జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

జోలాపుట్టు జలాశయం: పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా, ప్రస్తుతం 2711.80 అడుగులు మాత్రమే ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే (2024లో 2710 అడుగులు, 2025లో 2709 అడుగులు) ఈ ఏడాది కొద్దిగా మెరుగ్గా ఉన్నప్పటికీ, జలాశయం సామర్థ్యంతో పోలిస్తే ఇది తక్కువే. జోలాపుట్టు స్పిల్‌వే పూర్తిగా అడుగంటింది.

డుడుమ జలాశయం: దీని పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 2580 అడుగుల వద్ద ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది. 1955లో ప్రారంభమైన ఈ విద్యుత్‌ కేంద్రం, దశాబ్దాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ వస్తోంది. అయితే, గత మూడేళ్లుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల నీటి ఎద్దడి ఎదురవుతోంది. జోలాపుట్టు నుంచి డుడుమ మీదుగా బలిమెల వరకు నీరు ప్రవహిస్తూ, పలు విద్యుత్‌ కేంద్రాలకు ఆధారంగా నిలుస్తోంది.

మాచ్‌ఖండ్‌లో మరమ్మతులు

గత నెలలో మాచ్‌ఖండ్‌ విద్యుత్‌ కేంద్రంలోని ఎల్‌ఏవీటీ ప్యానెల్స్‌ పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల రోజుకు సుమారు 2.8 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ ఉత్పత్తి నష్టం జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఇతర విద్యుత్‌ కేంద్రాల నుండి కొత్త ప్యానెల్‌ బోర్డులు, ఇతర సామగ్రిని తెప్పించి కంట్రోల్‌ రూమ్‌లో అమర్చుతున్నారు. పాడైన వైరింగ్‌ను పునరుద్ధరిస్తున్నారు. జూలై మొదటి వారంలోగా రెండు జనరేటర్లను సిద్ధం చేసి, తిరిగి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

అడుగంటిన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు

గణనీయంగా పడిపోయిన నీటిమట్టాలు

ఎడారిని తలపిస్తున్న స్పిల్‌వే

విద్యుత్‌ ఉత్పత్తికి సవాళ్లు

వర్షాలు పడకుంటే ఇబ్బందే

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో విద్యుత్‌ ఉత్పత్తి మొదలు పెట్టే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టులో ప్రస్తుతం నూతన ప్యానెల్‌ బోర్డులు ఏర్పాటు చేసే పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు.రెండు జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయి.విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించే సమయానికి వర్షాలు కురిసి నీటి మట్టాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం.

– సీహెచ్‌ అప్పాజి, ఎస్‌ఈ, మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement