అరకులోయ టౌన్ : గిరిజన ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని, అరకులోయలోని వాలీబాల్ క్రీడా మైదానాన్ని మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేస్తామని ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె క్రీడా మైదాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, స్థానిక ఓల్డ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, అల్లూరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, ఈ మైదానాభివృద్ధి విషయమై రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డిని కోరానని తెలిపారు. గిరిజన యువత క్రీడల్లో రాణించే సత్తా కలిగి ఉందని, వారిని ప్రోత్సహిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారని ఆయనకు వివరించినట్లు తెలిపారు. తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సుబ్బారెడ్డి, కేవలం రెండు రోజుల్లోనే రూ. 30 లక్షల నిధులు కేటాయించారని, ఈ ప్రాంత ప్రజల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ నిధులతో రెండు వాలీబాల్ కోర్టులు, వాకింగ్ ట్రాక్, రెండు హైమాస్ట్ లైట్లు, బాలుర, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, బోరు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీకి మరమ్మతులు చేయిస్తామని ఎంపీ వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నామని ఎంపీ తెలిపారు. లిట్టిగుడ గ్రామానికి చెందిన 8 ఏళ్ల రన్నర్ జీవన తన్య ప్రతిభను సోషల్ మీడియా ద్వారా గమనించి, పరుగుల రాణి పి.టి. ఉషాతో మాట్లాడి ఆమె కోచింగ్ సెంటర్‌లో చేర్పించామని చెప్పారు. బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆమె సూచించారు. అనంతరం క్రీడాకారులకు టీ–షర్టులను పంపిణీ చేశారు. ఓల్డ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోషియేషన్ అధ్యక్షుడు ఎం.పౌలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, తహసీల్దార్ రాజా శ్రీధర్, డీఈ అభిషేక్, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, ఎల్‌బీ భీమరాజు, మాజీ సర్పంచ్‌లు భాస్కర్‌రావు, రాధిక, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎల్‌బీ కిరణ్‌కుమార్, పట్టాసి సంపత్‌కుమార్, ముఖీ సాంబయ్య, సోమేష్, అసోషియేషన్ చైర్మన్ బురిడి ఆనందరావు, వైస్ చైర్మన్ కొర్రా మధుసుధన్‌రావు, ఉపాధ్యక్షుడు జి. బాబురావు, కార్యదర్శి కె. అప్పలరాజు, మయూరి రాజు, క్రీడాకారులు పాల్గొన్నారు.


