గిరి రైతుకు కష్టం.. దళారికి లాభం | - | Sakshi
Sakshi News home page

గిరి రైతుకు కష్టం.. దళారికి లాభం

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

● చిలగడ దుంపకు గిట్టుబాటు ధరలేక విలవిల ● పాడేరు మార్కెట్‌లో నిలువు దోపిడీ ● ఆర్థికంగా కుదేలవుతున్న అన్నదాత

పాడేరు పాతబస్టాండ్‌ సంత ప్రాంగణంలో

కొనుగోలుదారులకోసం ఎదురుచూపులు

సాక్షి,పాడేరు: అందరికీ తీపిని పంచే చిలగడదుంపల సాగు గిరిజన రైతులకు మాత్రం గత రెండేళ్లుగా చేదు అనుభవాన్నే మిగుల్చుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై దిగుబడులు మార్కెట్‌కు వస్తున్నా, వ్యాపారుల సిండికేట్‌ కారణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు.

రూ.వెయ్యి నుంచి రూ.700కు ధర పతనం

పాడేరు పాతబస్టాండ్‌లో శుక్రవారం జరిగిన వారపు సంతలో గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత వారం 60 కిలోల బస్తా రూ. వెయ్యి ధర పలకడంతో రైతులు ఆశపడ్డారు. కానీ, వారం తిరిగేసరికి వ్యాపారులంతా కుమ్మకై ్క, బస్తా ధరను రూ. 600కు తగ్గించారు. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట మండలాల నుంచి సుమారు 150 బస్తాలను రైతులు సంతకు తీసుకురాగా, వ్యాపారులు తక్కువ ధరకే కొంటామని మొండికేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో, చివరికి ఒడిశాకు చెందిన ఓ వ్యాపారికి బస్తాకు రూ. 150 మినహాయించి అమ్ముకోవాల్సి రావడంతో రైతులు భారీగా నష్టపోయారు.

సేంద్రియ సాగుకు డిమాండ్‌ ఉన్నా..:

జిల్లాలోని 11 మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో గిరిజన రైతులు మెట్ట, కొండపోడు భూముల్లో చిలగడదుంపను పండిస్తున్నారు. వనుగుపల్లి, కిండంగి, కాడెలి, గొండెలి, గుత్తులపుట్టు, గబ్బంగి, తుంపాడ పంచాయతీలతో పాటు చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో దిగుబడులు ప్రారంభమయ్యాయి. రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండిస్తుండటంతో, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మన్యం చిలగడదుంపలకు మంచి డిమాండ్‌ ఉంది. రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ. 30కి పైగా అమ్ముడవుతున్నా, తమకు మాత్రం సరైన ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, మార్కెటింగ్‌ శాఖ అధికారులు స్పందించి వారపు సంతల్లో వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.

రెండేళ్లుగా నష్టాలే

తియ్యదుంపకు అనేక రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్నా కష్టపడి సాగు చేసిన మా గిరిజన రైతులకు మాత్రం గత రెండేళ్లుగా నష్టాలే మిగులుతున్నాయి. గత ఏడాది బస్తా రూ.వెయ్యికి విక్రయించగా, ఈ ఏడాది స్థానిక వ్యాపారులు ధరలను పతనం చేశారు. ఒడిశా వ్యాపారులు బస్తా రూ.700కు మించి కొనుగోలు చేయడం లేదు. వారం వ్యవధిలోనే తియ్యదుంపల ధరను వ్యాపారులు పతనం చేయడం అన్యాయం

– లైకోన్‌ లక్ష్మణ్‌, గిరిజన రైతు, గురుపల్లి, పాడేరు మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement