పాఠశాల ఉన్నా.. బోధించేవారేరీ? | - | Sakshi
Sakshi News home page

పాఠశాల ఉన్నా.. బోధించేవారేరీ?

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

● టీచర్లు లేక వెనక్కి వెళ్తున్న విద్యార్థులు ● పెద్దగంగవరంలో అస్తవ్యస్తంగా విద్యావ్యవస్థ

సీలేరు: కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించి, అన్ని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గొప్పలు చెబుతున్నా, ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉపాధ్యాయుల నియామకంపై మండల విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

పాఠశాల ఉన్నా.. బోధించే వారే లేక..

దారకొండ పంచాయతీ పెద్దగంగవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచి నేటి వరకు ఒక్క ఉపాధ్యాయుడూ లేకపోవడంతో విద్యార్థుల చదువు గాలిలో దీపంలా మారింది. ఉపాధ్యాయుడు లేకపోవడంతో తరగతులు నిర్వహించడమే లేదు. దీంతో నిత్యం పాఠశాలకు వచ్చే విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తున్నారు. ఉపాధ్యాయుల నియామకం లేకపోవడంతో గత వారం రోజులుగా విద్యార్థులు పాఠశాలకే రావడం మానేశారు.

ఆటపాటలకే పరిమితం

ప్రవేశాలు కల్పించేందుకు, అలాగే టీసీలు ఇచ్చేందుకు కనీసం ఒక బాధ్యతాయుతమైన అధికారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడికి వెళ్లాల్సిన విద్యార్థులు ఆటపాటలకు పరిమితం కాగా, మరికొందరు పొలం పనులకు వెళ్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఉన్న ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిన తర్వాత, కొత్తగా ఎవరినీ నియమించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు మండల విద్యాశాఖ అధికారులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని వారు వాపోయారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

50 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఏపీజీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ వార్డు మెంబర్‌ పాంగి పుల్లయ్య, పంగి బలరాం, పంగి సన్యాసిరావు, తిరుపతి, వంతల శ్రీను, కోడా నారాయణ తదితరులు హెచ్చరించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిని నియమించాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement