1/70 పరిరక్షణకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

1/70 పరిరక్షణకు సిద్ధం కావాలి

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

● చింతపల్లి డివిజన్‌ ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణ ఐక్యవేదిక పిలుపు

గిరిజన భవన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న ఐక్యవేదిక నేతలు

కొయ్యూరు: 1/70 చట్టాన్ని రక్షించుకోవాలని, గిరిజనేతరుల ఆక్రమణలను అడ్డుకోవాలని చింతపల్లి డివిజన్‌ ఆదివాసీ హక్కుల చట్టాల పరిరక్షణ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం రాజేంద్రపాలెం గిరిజన భవన్‌లో నిర్వహించిన సమావేశంలో గిరిజన చట్టాల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. స్థానిక నేత నర్సి పాపారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

చట్ట సవరణపై ఆందోళన

గిరిజన భూములకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని సవరించాలని కోరుతూ 1,700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసు నేపథ్యంలో, చట్టాన్ని కాపాడుకునేందుకు న్యాయ, ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కావడం లేదని ఐక్యవేదిక విమర్శించింది. ఒకవేళ సుప్రీంకోర్టు చట్ట సవరణకు ఆమోదం తెలిపితే, గిరిజన భూములకు రక్షణ ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోరాటాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కంకిపాటి వీరన్న పడాల్‌, భారత్‌ రాష్ట్ర ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు, విశ్రాంత డీఎస్పీ కాకూరి బాలరాజు, వైఎస్సార్‌సీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్‌, వైఎస్సార్‌సీపీ నేత వారా చిన నూకరాజు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సీపీఎం నేత సరుమూర్తి సూరిబాబు, సీపీఐ మండల కార్యదర్శి ఉల్లి సూరిబాబు, స్థానికులు చుంద్రు కృష్ణ, బూరుగు వెంకటరావు, శ్యామల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement