నాతవరం: మీకు నచ్చిన విత్తన రకం కావాలంటే కూటమి నేతలు చెబితే చాలు అధికారులు ఠంచనుగా ఇచ్చేస్తారు. అదే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన రైతులు వెళ్తే సవాలక్ష నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇది నాతవరం మండలంలో వరి విత్తనాల పంపిణీలో చూపిస్తున్న వివక్ష.. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏటా ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోనే నాతవరం మండలంలో అధిక విస్తీర్ణంలో వరి పంట రైతులు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది మండలంలో 8 వేల నుంచి 10 వేల హెక్టార్లలో సాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఖరీఫ్ సాగుకు 1,507 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు చేశారు. గత నెల 29వ తేదీన మండలానికి వచ్చిన నాలుగు రకాల విత్తనాలు 553 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు తరలించారు. ఈ నెల 12వ తేదీన చినగొలుగొండపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి ఆధ్వర్యంలో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు రైతులకు విత్తనాలు పంపిణీని ప్రారంభించారు. స్పీకరుతో ఆర్భాటంగా పంపిణీ చేయడంతో రైతులందరికి కావలసిన విత్తనాలు సకాలంలో అందుతాయని ఆశించారు.
కూటమి నేతలు చీటీలు రాసి ఇస్తే విత్తనాలు
మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది కొరత ఉండటంతో క్షేత్రస్థాయిలో కూటమి నేతలు ఇష్టానుసారంగా పెత్తనం చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లో వరి విత్తనాలు కూటమి నేతలు వద్దకు వెళ్లి చీటీలు రాసి తెచ్చుకుంటే కావలసిన రకం విత్తనాలు ఇస్తున్నారు. నేరుగా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే విత్తనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. రేపుమాపు రావాలంటూ రైతులను తిప్పించుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. తాండవ రిజర్వాయరులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటంతో ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరు విడుదల చేస్తామంటూ అధికారులు ప్రకటన చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికై న ఉన్నతాధికారులు దృష్టి సారించి రైతులకు కావలసిన వరి విత్తనాలు పంపిణీ చేయడంలో వివక్ష చూపకుండా కూటమి నేతలు పెత్తనం లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు.
రైతులకు వరి విత్తనాలు పంపిణీలో వివక్ష
అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో పంపిణీ
వైఎస్సార్‌సీపీ మద్దతు రైతులకు ఇబ్బందులు


