● ధారమటం జలపాతం వద్ద ఘటన
● గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
గొలుగొండ: కన్నవారికి పుత్రశోకం మిగిలింది. ఎదిగొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. సరదాగా జలపాతాల వద్ద స్నానం చేద్దామని అనుకున్న యువకుడు కాలుజారి ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడని అనుకొన్న తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు చెందిన చుక్కల సాంబశివ(21) ప్రమాదశాత్తూ ధారమఠం జలపాతంవద్ద శుక్రవారం మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతోపాటు ఈ ప్రాంత ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళితే..బంధువులైన వాడపల్లి మణికంఠ, పలక భానుప్రసాద్‌తో కలిసి జి. మాడుగుల గ్రామానికి చెందిన చుక్కల సాంబశివ(21) శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ధారమఠం శివా లయానికి వచ్చాడు. శివాలయం వద్ద నుంచి కొండఅంచున చాలా దూరం వెళ్లి అక్కడ మూడు కొండల నడుము ఉన్న జలపాతం వద్ద సాంబశివ స్నానం చేసే సమయంలో కాలుజారి పక్కనే ఊబి లో కూరుకుపోయాడు. అక్కడే ఉన్న మణికంఠ, భానుప్రసాద్ హుటాహుటిన గుడి వద్దకు వచ్చి సమాచారం ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికులు గొలుగొండ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో గొలుగొండ ఎస్‌ఐ పి.రామారావు, కృష్ణదేవిపేట ఎస్‌ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు ప్రమాదం జరిగిన ప్రాంతం వద్దకు వెళ్లి పరిశీలించారు. సాంబశివ పూర్తిగా ఊబిలో కూరుకుపోయినట్టు గుర్తించి తాళ్లు, కర్రల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. దారమఠం వద్ద ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారికావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల గుండెలవిసేలా రోదించారు. తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు గొలుగొండ ఎస్‌ఐ రామారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాంబశివ విశాఖ ఏయూలో ఇంజినీరింగ్(ఈఈఈ) మూడవ సంవత్సరం చదువుతున్నాడు.


