అచ్యుతాపురం రూరల్ : రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ అవార్డుకు అచ్యుతాపురం కేజీబీవీ విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రిక ఎంపికై నట్టు మండల విధ్యాశాఖ అధికారి దేవరాయల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అచ్యుతాపురం మండలానికి చెందిన విద్యార్థిని ఎంపికవడం గర్వకారణమన్నారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్ అవార్డుకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కేవలం ఒక్క విద్యార్ధిని ఎంపికవడం విశేషమన్నారు. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈనెల 29న మంగళగిరిలో రాష్ట్ర స్థాయి సత్కార కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్థిని కాండ్రేగుల పూర్ణ సౌత్రికతో పాటు తల్లిదండ్రులు తప్పనిసరిగా జూన్ 28 మద్యాహ్నం 2 గంటలలోపు మంగళగిరికి చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు విద్యార్థినికి అభినందనలు తెలిపారు.


