గిరిజన బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, సకాలంలో చికిత్స అందక వరుసగా విద్యార్థులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఫైళ్లకే పరిమితం కావడంతో, జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు నేడు ప్రాణభయంతో బిక్కుబిక్కుమని గడపాల్సిన దుస్థితి నెలకొంది
ఆశ్రమాల్లో
సాక్షి,పాడేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందని ద్రాక్షలా మారింది. పాఠశాలల్లో వైద్య సిబ్బంది నియామకాలు లేకపోవడంతో, విద్యార్థులకు అనారోగ్యం సోకితే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. సకాలంలో వైద్యం అందక గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 22న చిలకలగెడ్డ ఆశ్రమ పాఠశాలకు చెందిన కొర్రా సంజు (13) అనే విద్యార్థి మలేరియాతో మరణించడం విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. సకాలంలో వైద్య పరీక్షలు చేసే సిబ్బంది లేకపోవడంతో, ఆ విద్యార్థిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
మాట తప్పిన సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల సమయంలో అరకులో నిర్వహించిన సభలో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండు విద్యాసంవత్సరాలు ముగిసి, మూడవ సంవత్సరం ప్రారంభమైనా ఆ హామీ అమలుకు నోచుకోలేదని, దీనివల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి తొలి సంతకం ఏమైంది?
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సంధ్యారాణి, హెల్త్ వలంటీర్ల నియామకంపైనే తొలి సంతకం చేశారు. ఇది గిరిజన వర్గాల్లో ఆశలు రేకెత్తించినప్పటికీ, సంతకం చేసిన రెండేళ్ల తర్వాత కూడా ఒక్క హెల్త్ వలంటీర్‌ను కూడా నియమించకపోవడం గమనార్హం. మంత్రి పెట్టిన ఆ ఫైలు కార్యాలయాలకే పరిమితమై మూలకు చేరింది.
విద్యార్థులపై
పెనుభారం
ప్రస్తుతం జిల్లాలోని 117 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 55 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు అనారోగ్యంతో ఉన్న విద్యార్థులను ఆసుపత్రుల చుట్టూ తిప్పాల్సి వస్తోంది. పాఠశాలలు ప్రారంభమైన తొమ్మిది రోజులకే అనంతగిరిలో ఒక విద్యార్థి మృతి చెందడం, అంతకుముందు 2024– 25లో ఆరుగురు, 2025–26లో జి.మాడుగుల మండలం బందవీధిలో ఒక విద్యార్థి మరణించడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు వెంటనే ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రెండేళ్లలో ఎనిమిది మంది మృతి
వరుస మరణాలతో గిరిజన
పాఠశాలల్లో ఆందోళన
నిమ్మకు నీరెత్తినట్టు
వ్యవహరిస్తున్న ప్రభుత్వం
హెల్త్ వలంటీర్ల నియామకం గాలికి
అమలుకాని ఎన్నికల హామీ
అందనంత దూరంలో సత్వర వైద్యం
వైద్యంపై నిర్లక్ష్యం దారుణం
కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల వైద్యం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. హెల్త్ వలంటీర్లను నియమిస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని కనీసం పట్టించుకోకపోవడం అన్యాయం. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు గత రెండేళ్లుగా సత్వర వైద్య సేవలకు దూరమయ్యారు. వరుసగా విద్యార్థుల మరణాలు చోటుచేసుకుంటున్నా, ముఖ్యమంత్రికి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి ఏమాత్రం పట్టకపోవడం దారుణం.
– లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం


