ప్రజలకు అందుబాటులో ఉంటా | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉంటా

Jun 26 2026 3:59 AM | Updated on Jun 26 2026 3:59 AM

అరకులోయ టౌన్‌: అరకు పార్లమెంటు పరిధిలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పార్లమెంటు కేంద్రమైన అరకులోయలో తన క్యాంప్‌ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి తెలిపారు. గురువారం అరకులోయలో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, పార్టీ అరకు పార్లమెంటు పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు, ఇతర నాయకులతో కలిసి ఆమె ఎంపీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. థింసా నృత్యాలతో మహిళా నాయకులు సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, గతంలో పనిచేసిన ఎంపీలు ఎవరూ నియోజకవర్గ కేంద్రంలో అందుబాటులో ఉండేవారు కాదన్నారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను చెప్పుకునే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితికి తావులేకుండా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.. అని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో అరకు పార్లమెంటు పరిధిలోని ఏడు మండలాల్లో రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, ముఖ్యంగా విద్య, వైద్యం, పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఏడు మండలాల్లో 10 అంబులెన్సుల ఏర్పాటు, తారాబు జలపాతం అభివృద్ధికి రూ.5 కోట్లు, 36 ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, విద్యుత్‌ దీపాల అమరిక వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు.

గిరిజన చట్టాల రక్షణ కోసం పోరాటం

హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అలాగే బాకై ్సట్‌ నమూనాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పేర్కొన్నారు. 1/70 చట్టం, జీవో నంబర్‌ 3, హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని, ప్రధాని, హోంమంత్రితో పాటు సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాకై ్సట్‌ తవ్వకాలకు సంబంధించిన జీవో 97ను రద్దు చేశారని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో అరకులోయ, పాడేరు స్థానాలతో పాటు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని, జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆమె జోస్యం చెప్పారు. అరకు పార్లమెంటు పార్టీ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కోరారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, పార్టీకి అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ కుంభా రవిబాబు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటున్న ప్రజలందరూ భవిష్యత్తులోనూ పార్టీకి సహకరించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, నాయకులు, కార్యకర్తలు అరకులోయలోని ఈ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌, మాజీ ఎమ్మెల్యే హైమావతి దేవి, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, వైఎస్సార్‌, టీఎస్సార్‌ ట్రస్టు వ్యవస్ధాపకుడు టి. సురేష్‌ కుమా ర్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, జెడ్పీటీసీ జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, టి. మిథుల, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎంపీ కార్యాలయం ఎదుట ఎంపీ తనూజరాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్‌

క్యాంప్‌ కార్యాలయం ప్రారంభానికి హాజరైన పార్టీ శ్రేణులు

రెండేళ్లలో రూ.20 కోట్లతో

నియోజకవర్గ అభివృద్ధి

గిరిజన చట్టాల రక్షణకు

పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా

2029లో జగనన్నను

సీఎం చేయడమే లక్ష్యం

ఎంపీ తనూజరాణి

అరకులోయలో క్యాంప్‌

కార్యాలయం ప్రారంభం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement