అరకులోయ టౌన్: అనంతగిరి మండలం బొర్రా గుహల వద్ద వ్యాపారాలు చేసుకుంటున్న 109 మంది గిరిజన వ్యాపారుల షాపులను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ, బాధిత వ్యాపారులు గురువారం ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని గద్యగుడలో ఉన్న రవిబాబు ఫామ్ హౌస్‌లో బొర్రా వర్తక సంఘం ప్రతినిధులు, దుకాణ యజమానులు ఆయనను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బొర్రా గుహల అభివృద్ధి కోసం పర్యాటక శాఖ రూ.30 కోట్లు కేటాయించిందని, అయితే అభివృద్ధి పనుల పేరిట ప్రస్తుతం అక్కడ ఉన్న 109 దుకాణాలను తొలగించి, డీపీఆర్‌లో కేవలం 38 దుకాణాలకు మాత్రమే స్థానం కల్పించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు, ఈ నిర్ణయం వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని పర్యాటక శాఖ డీవీఎం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఎమ్మెల్సీకి వివరించారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం: స్పందించిన ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. స్థానిక గిరిజనుల హక్కులు, జీవనోపాధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. గిరిజనుల సమస్య పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని, జిల్లా అధికారులు, పర్యాటక శాఖ డీవీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. 109 గిరిజన కుటుంబాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ గిరిజనులకు అన్యాయం జరిగితే, బొర్రా గుహల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బొర్రా గుహల ప్రవేశ రుసుము, జిప్‌లైన్ ఆదాయంలో గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటాను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. శివరాత్రి ఉత్సవాల నిర్వహణలో పంచాయతీకి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, బొర్రా మాజీ సర్పంచ్ జన్ని అప్పారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కుంభా రవిబాబుకు‘బొర్రా గుహల’ బాధిత వ్యాపారుల వినతి


