మాజీ మంత్రి బాలరాజు విమర్శ
అరకులోయ టౌన్: దేశ, విదేశాల్లో పేరొందిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పసుపులేటి బాలరాజు విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అరకులోయ పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, కనీసం రాత్రి వేళల్లో వీధి దీపాలు కూడా వెలగని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు, అధికారులకు రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయినా పట్టించుకునే నాథుడే లేరని ధ్వజమెత్తారు. ముఖ్యంగా అరకులోయ పట్టణంలోని డివైడర్లలో ప్రమాదకరమైన వయ్యారి భామ మొక్కలు పెరుగుతున్నాయని, వీటి వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి ఆ మొక్కలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారి 516 ఉ బైపాస్ రోడ్ల వద్ద బెంజిపూర్, అరకు సంతబయలు తదితర ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్లను అస్తవ్యస్తంగా నిర్మించారని, దీనివల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని బాలరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు అప్రోచ్ రోడ్ల డిజైన్‌ను మార్చి, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, భూర్జ సుందర్‌రావు, మాజీ సర్పంచ్ చటారి వెంకటరావు, సూపర్ ఎంపీటీసీ సొనాయి కృష్ణారావు పాల్గొన్నారు.


