డుంబ్రిగుడ: విద్యార్థుల విద్యా ప్రగతి, ఆరోగ్యం, సంక్షేమంతో పాటు పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ అన్నారు. గురువారం ఆయన మండలంలోని గుంటసీమ బాలుర, నందివలస బాలికల ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గుంటసీమ పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను ఆయన పరిశీలించారు. విద్యార్థుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంట గది, స్టోర్ రూమ్‌లు, డార్మిటరీలు,పాఠశాల పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్వహణను మరింత మెరుగుపరచాలని పీవో సూచించారు.


