విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
● బ్యాగులు కరువు
● యూనిఫాంల సంగతీ అంతే
● బూట్లు లేక పాత చెప్పులే గతి
సాక్షి,పాడేరు: పాఠశాలలు తెరిచిన రోజే ప్రతి విద్యార్థికీ విద్యాకానుక అందజేస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది.వాస్తవానికి పూర్తిస్థాయిలో విద్యాకానుక కిట్లు రాకపోవడంతో అందినవాటినే అరకొరగా పంపిణీ చేస్తున్నారు. విద్యా కానుక కింద అన్ని వస్తువులూ ఏ స్కూలులోనూ, ఏ పిల్లవాడికీ అందిన దాఖలాలు లేవు. బూట్లు,యూనీఫాంలు అందకపోవడంతో పాత, చిరిగిన వాటినే విద్యార్థులు ధరించి పాఠశాలలకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాకానుక కిట్లను పాఠశాలల ప్రారంభం రోజునే పంపిణీ చేయగా,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా కిట్ల పంపిణీని అటకెక్కిస్తోంది.ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరచి 10 రోజులు కావస్తున్నా విద్యా కానుక కిట్లు కేవలం పాఠ్య,నోటు పుస్తకాలకే పరిమితమైంది.
యూనిఫాం,
ఇతర సామగ్రి కరువే
అల్లూరి సీతారామరాజు,పోలవరం జిల్లాలు యూనిట్‌గా విద్యాశాఖ పనిచేస్తోంది.ఈ రెండు జిల్లాల్లోని 22 మండలాల పరిధిలో 1,77,733 మంది విద్యార్థులు చదువుతున్నారు.వారందరికీ విద్యా కానుక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయాల్సి ఉండగా పుస్తకాలకే పరిమితమైంది.ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి అర కొరగానే మండల కేంద్రాలకు చేరుకోవడంతో వాటిని అన్ని పాఠశాలల విద్యార్థులకు పంపిణీని చేయలేకపోతున్నారు.
ఇప్పటికీ చేరని కానుకలు
రెండు జిల్లాల పరిధిలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విద్యా కిట్లు సరఫరా కాలేదు.46,439 యూనిఫాం మెటీరియల్, బూట్లు, 69,560 బ్యాగులు,18,641 బెల్ట్‌లు మాత్రమే మండల కేంద్రాలకు చేరుకున్నాయి.విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా విద్యా కిట్లు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.చిరిగిన బ్యాగులు.పాత యూనిఫాంలనే విద్యార్థులు వినియోగిస్తున్నారు.బూట్లు పంపిణీ చేయకపోవడంతో తమ పాత చెప్పులతోనే పాఠశాలలకు వస్తున్నారు.


