పాడేరు : జిల్లాలో శాశ్వతంగా గంజాయి సాగు నిర్మూలించడంతో పాటు రైతులకు అధిక ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్టు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బి.కర్ణ తెలిపారు. పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి. మాడుగుల మండలాల గిరిజన రైతులకు ఉద్యానవన శాఖ, ఈగల్ టీం ద్వారా విలువైన అవకాడో, రాం బూటన్ మొక్కలను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిషేధిత, అక్రమ పంటల సాగును పూర్తిగా విడిచిపెట్టి స్థిరమైన ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటలు, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలన్నారు. రైతులకు తోటల స్థాపన, నిర్వహణ, సాంకేతిక మార్గదర్శకాలను ఉద్యానవన శాఖ ఉచితంగా అందజేస్తూ వారిని జీవనోపాధి మెరుగుదలకు కృషి చేస్తోందని చెప్పారు. గంజాయి రహిత సమాజ నిర్మాణంతో పాటు స్థిరమైన ఆదాయ వనరులను కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన అధికారి బి. శరణ్యమాధురి, ఈగల్ టీం సీఐ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ


