పాడేరు రూరల్: అనంతగిరి ప్రభు త్వ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఈనెల 23న కొర్రా సంజు అనే విద్యార్థి మృతి చెందడం ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్‌యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లే గిరిజన విద్యార్థుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు చులకనగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు పెడుతున్న వంటకాల్లో నాణ్యత ఉండడం లేదని, అందువల్లే అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు.విద్యార్థి మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబుజ్జి, అంజల్‌కుమార్ పాల్గొన్నారు.


