నర్సీపట్నం : బీసీ హాస్టల్లో విద్యార్థులను చేర్పేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. దీంతో బాలబాలికలను సంబంధిత వసతి గృహాల్లో చేర్చుకునేందుకు సంక్షేమాధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. పేదవర్గాలు చిన్నారుల చదువులకు భరోసా ఇవ్వడంలో ఇవి పునాదిలా నిలుస్తున్నాయి. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు అందుతుండడంతో వీటిలో సీట్లకు డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం ముందుచూపుతో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వసతిగృహాల్లో మరమ్మతులు చేపట్టి ఉంటే విద్యార్థులకు మేలు చేకూరేది.
వెంటాడుతున్న సమస్యలు
నర్సీపట్నం మండలం, వేములపూడి బీసీ బాలికల వసతి గృహంలో 15 గదులు ఉండగా వీటిలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతిని పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో వసతి గృహంలో ఇప్పటికే వసతి పొందుతున్న విద్యార్థులను మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. కొత్త విద్యార్థులు చేరేందుకు అవకాశం లేకుండా పోయింది.
వసతి సమస్యతో సతమతం
నర్సీపట్నం సబ్ డివిజన్‌లో వెనుకబడిన తరగతులు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 11 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సుమారు 1600 మంది విద్యార్థిని, విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒక్కో హాస్టల్‌లో 100 నుంచి 300 మందిని చేర్చుకునేందుకు అవకాశం కల్పించారు. వేములపూడి బాలికల వసతిగృహంలో ఐదు గదుల శ్లాబ్ పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన పది గదుల్లో ఉన్న విద్యార్థులకే వసతి సమస్య కారణంగా కొత్త విద్యార్థులను తీసుకోవడం లేదు. 70 మంది విద్యార్థినులు వసతి గృహంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకున్నారు.
సీటు వస్తుందనే నమ్మకంతో సమీపంలోని హైస్కూళ్లలో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించారు. తీరా వసతి గృహానికి వెళ్తే కొత్త విద్యార్థులను చేర్పించుకోవడం లేదని చెప్పడంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సత్వరమే మరమ్మతులు చేపట్టి విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
భవనం మరమ్మతుపనులకు ప్రతిపాదనలు
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ బోళెం రాంప్రసాద్ స్థానిక సంక్షేమాధికారి, హైస్కూళ్ల హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. వసతి చాలని కారణంగా కొత్త విద్యార్థులను చేర్చుకోవద్దని ఉన్నతాధికారులు సూచించినట్టు సంక్షేమాధికారి వెంకటలక్ష్మి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తొందరపడి విద్యార్థులను తిరిగి పంపించొద్దని స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకుందామని సూచించినట్టు తెలిసింది. దీనిపై ఏబీసీ డబ్ల్యూవో గోపీనాథరావును వివరణ కోరగా వసతి సమస్య వల్లనే పిల్లలను చేర్చుకోవడం లేదని తెలిపారు. భవన మరమ్మతులకు రూ.23 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని, నిధులు విడుదలైన వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. వసతి సమస్య తీరిన వెంటనే విద్యార్థులను చేర్చుకుంటామని తెలిపారు.


