ఎస్.రాయవరం: అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. భీమవరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి ఇరువురు సీనియర్ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులు ఇతరులతో కలిపి పది మంది వైఎస్సార్‌సీపీలో చేఆరు. కంబాల జోగులు వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కంబాల జోగుల మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయలేక చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లకే చతికిలబడిందని ఎద్దేవా చేశారు. కుట్ర రాజకీయాలతో అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు మరింత సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మధువర్మ, స్థానిక గ్రామ కమిటీ అద్యక్షులు గరగా శ్రీనివాసరావు, పార్టీలోచేరిన పాలపర్తి శ్రీను, రామారావు కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.


