సాక్షి,పాడేరు: జిల్లాలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో గిరిజ నుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం ప్రభావంతో నిల్వ నీరు పెరగడం, పారిశుధ్య లోపాలు కారణంగా దోమల సంఖ్య అధికమవ్వడంతో ఈ వ్యాధులు విజృంభిస్తున్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో జ్వర పీడితులు చేరుతున్నారు. 430 బెడ్ల సామర్థ్యం ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 400 పడకలు దాదాపు నిండిపోయాయి. కొత్తగా వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడం వైద్య సిబ్బందికి సవాలుగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆరోగ్య కేంద్రాలకు వచ్చే కేసులు ఎక్కువగా ఉండటంతో, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి రిఫరల్ కేసులు పెరుగుతున్నాయి. మలేరియా కేసులు గిరిజన ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతాలు, చెరువులు, వాగులు దగ్గర నివసించే ప్రజలు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. మరోవైపు డెంగ్యూ కేసులు కూడా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. రక్తపరీక్షల ద్వారా నిర్ధారణ అయిన కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం.
600 దాటుతున్న ఓపీ
సీజనల్ వ్యాధుల ప్రభావంతో పాడేరులోని జిల్లా ఆస్పత్రితో పాటు అరకులోయ ఏరియా ఆస్పత్రి, చింతపల్లి, ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగుల రద్దీ అధికమైంది. జిల్లాలోని 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జ్వర పీడితులను పాడేరు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. పాడేరు జిల్లా ఆస్పత్రిలో 400 వరకు రోగులు ఇన్‌పేసెంట్లుగా ఉన్నారు. రోజు వారి ఓపీ 600 దాటుతుంది. వీరిలో 200 మంది వరకు జ్వరపీడితులు ఉండడంతో రక్త పరీక్షల కేంద్రం నిత్యం రద్దీగా ఉంటుంది. గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించి మలేరియా, డెంగ్యూ, వైరల్, టైపాయిడ్ వంటి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.
కానరాని ఫాగింగ్
జిల్లాలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. అన్ని గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ పనులు జరగకపోవడం, అన్ని కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేయకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు దోమకాట్లకు గురవుతూ మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. పీహెచ్‌సీల నుంచి వస్తున్న మలేరియా కేసులకు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు కల్పిస్తుండడంతో ప్రాణాపాయం తప్పుతుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు మైదాన ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా మలేరియా, డెంగ్యూ రోగులు అధికంగా తరలివెళ్లి వైద్య సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో 10 మంది వరకు మలేరియా రోగులు ఉండగా.. వారిలో కొంత మందికి ప్లేట్‌లెట్స్ తగ్గిపోయిన పరిస్థితితో ఆందోళనకరంగా ఉంది. జిల్లా ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్ పెంచేందుకు ఉన్నత వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులను కేజీహెచ్‌కు తరలిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో 1133 మలేరియా కేసులు నమోదయ్యాయి. మరోవైపు అధికారికంగా 7 డెంగ్యూ కేసులు నమోదవ్వగా, ప్రైవేట్ ఆస్పత్రులలో అనధికారికంగా చికిత్స పొందిన డెంగ్యూ రోగులు అధికంగా ఉన్నట్టు సమాచారం. మలేరియా, డెంగ్యూ తీవ్రత ఉన్నప్పటికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి పారిశుధ్య చర్యలు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే సీజనల్ వ్యాధులు మరింత విజృంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరు నెలల్లో మలేరియా కేసుల వివరాలు
పాడేరు జిల్లా ఆస్పత్రిలో పరిస్థితి
బెడ్ల సామర్థ్యం 430
ఇన్‌పేషెంట్లు 400
రోజు వారీ ఓపీ 600
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
భయపెడుతున్న మలేరియా
డెంగ్యూ కేసులూ నమోదు
జిల్లా ఆస్పత్రికి రోగుల తాకిడి
బెడ్స్ సరిపోక అవస్థలు
పీహెచ్‌సీల నుంచి
రిఫరల్ కేసులూ అధికమే
నెల కేసులు
జనవరి 23
ఫిబ్రవరి 43
మార్చి 106
ఏప్రిల్ 165
మే 445
జూన్ 351
మొత్తం 1133


