పెదబయలు: గ్రామాల్లో ఎవరికి జ్వరం వచ్చినా వెంటనే ఆశ కార్యకర్తను సంప్రదించి సమీప ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ తర్వాతే మందులు వాడాలని జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డా. తులసి సూచించారు. మంగళవారం మండలంలోని కుంతుర్ల పంచాయతీ బొడ్డగొంది గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామంలో దోమల నివారణ చర్యలపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇంటింటా తిరిగి దోమల మందు పిచికారీ జరిగిందా లేదా అన్నది ఆరా తీశారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వనుగూరు మేరీ(9), వనుగూరు జీవన్‌రాజ్(7) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులతో, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతి చెందిన చిన్నారుల తండ్రి అనుగూరు కోటిబాబు, అనుగూరు మేసేలుకు మలేరియా పాజిటివ్‌గా తేలడంతో వారికి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న 70 మంది, మంగళవారం మరో 12 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా, ఎక్కువ మందికి వైరల్ జ్వరాల లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. గ్రామంలో తాగునీటి పరిస్థితిని కూడా పరిశీలించారు. అన్ని ఇళ్లలో దోమల మందు పిచికారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రులనే ఆశ్రయించాలి
జిల్లాలో ఎవరికి జ్వరం వచ్చినా నాటు వైద్యం లేదా అనధికార వైద్యుల వద్దకు వెళ్లకుండా, ఆశ కార్యకర్తల సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని తులసి సూచించారు. వ్యాధి నిర్ధారణ కాకముందే మందులు వాడటం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కాచిచల్లార్చిన నీరు తాగాలని, దోమలు నివారణకు ప్రతి మూడు రోజులకు ఒకసారి వేపాకులు లేదా పిడకల పొగ వేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 1604 గ్రామాల్లో మొదటి దఫా దోమల మందు పిచికారీ పూర్తి కాగా, మిగిలిన గ్రామాల్లో జూలై 1 నుంచి రెండో దఫా చేపట్టనున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైతే వెంటనే తనను సంప్రదించాలని డా. తులసి ఫోన్ నంబర్‌ను గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్సల్టెంట్ అధికారి శ్రీనివాసరావు, మండల మలేరియా సిబ్బంది బింగురాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలి
జ్వరం వస్తే వెంటనే పరీక్షలు
చేయించుకోండి
జిల్లాలో 1604 గ్రామాల్లో
మొదటి దఫా ఫాగింగ్
బొడ్డగొంది గ్రామాన్ని సందర్శించిన జిల్లా మలేరియా అధికారి తులసి


