జి.మాడుగుల: ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించి సేంద్రియ ఉత్పత్తులు మరింతగా పెంచాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. మండలంలో గెమ్మలి పుత్తడిగొంది గ్రామంలో మంగళవారం బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం అధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ఈ పరికరాల వినియోగంతో శ్రమ ఆదాతో పాటు పంటల రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ చందు మీనా మాట్లాడుతూ వ్యవసాయ యంత్రాలు, సాంకేతికతను రైతులు అందించే ఉద్దేశంతో దేశం అంతటా ఐఏఆర్‌ఐ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 8 గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు స్ప్రేయర్లు, విత్తన గొర్రు(సీడ్ డ్రిల్), టార్పాలిన్లు, పవర్ వీడర్లు, చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అదనపు ఆదాయం నిమిత్తం నాటు కోళ్లను కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ కుర్రా, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, తహసీల్దార్ రాజ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో సన్యాసిరావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్, వ్యవసాయ అధికారి పాత్రుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ సమన్వయకర్త సీతారామరాజు, రైతులు పాల్గొన్నారు.


