ముంచంగిపుట్టు: ఆరో తరగతిలో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా నేతలు కె. త్రినాథ్, ఎం. శ్రీను మాట్లాడుతూ, ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేర్పించేందుకు వెళ్తే, సీట్లు లేవని ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున, సీట్లు పెంచడంతో పాటు కొత్త పాఠశాలలను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో ధర్మారావు స్పందించి, ఏటీడబ్ల్యూవో స్వర్ణలతతో మాట్లాడారు. ప్రవేశం కోరిన ప్రతి విద్యార్థికి సీటు కల్పించాలని హెచ్‌ఎంలను ఆదేశించడంతో, నిరసనకారులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహిళా సంఘం మండల కార్యదర్శి ఎస్. ఈశ్వరి, పలువురు నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


