మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర హామీ ఇచ్చారు. సోమవారం ఆమె మండలంలోని సుజనకోట పంచాయతీ, తోటపుట్టు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ

గ్రామంలో ఎంతో కాలంగా ఉన్న కల్వర్టు సమస్యను పరిష్కరిస్తూ, జెడ్పీ నిధుల నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ ప్రత్యేక పూజలు చేసి, శంకుస్థాపన చేశారు. కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో గిరిజన మహిళను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టడం వల్ల, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని పేర్కొన్నారు. సుజనకోట పంచాయతీ పరిధిలోని 14 గ్రామాల్లో సీసీ రోడ్లు, తాగునీటి బోర్లు, డ్రైనేజీలు, కల్వర్టుల కోసం నిధులు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలను ఆమె పరామర్శించి, ఓదార్చారు.

అంగన్‌వాడీ భవనం కోసం వినతి

తోటపుట్టు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి సొంత భవనం లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారని గ్రామస్తులు నారాయణ, రమేష్‌, మహేంద్ర, జీనబంధు, జయరాం, డొంబ్రులు చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుభద్ర, అంగన్‌వాడీ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించారు. కొత్త భవన నిర్మాణానికి తగిన నిధులు మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, జేసీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అరబీరు జగబంధు, ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచ్‌ వెంగడ రమేష్‌, మండల వైఎస్సార్‌సీపీ నేతలు బాబురావు,రాధాకృష్ణ పాల్గొన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement