ఎంపీడీవో శ్యాంసుందర్
పెదబయలు: మండలంలోని కుంతుర్ల పంచాయతీ, బొడ్డగొంది గ్రామంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని స్థానిక ఎంపీడీవో శ్యాంసుందర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన బొడ్డగొంది గ్రామాన్ని సందర్శించి, మృతి చెందిన మనుగూరు మేరీ (9), అనుగూరు జీవన్‌రాజ్ (7) కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఒకే కుటుంబంలో అక్కాతమ్ముళ్లు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్య పరిస్థితి, వారికి అందించిన వైద్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరికై నా జ్వరం లేదా ఇతర వ్యాధుల లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఆశా కార్యకర్తను సంప్రదించి స్థానిక పీహెచ్‌సీకి సమాచారం అందించాలని సూచించారు. ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్యం పొందాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని కుంతుర్ల పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అలాగే, గ్రామస్తులు వినియోగిస్తున్న గ్రావిటీ నీటిని ఆయన పరిశీలించారు.
రెండో రోజు కొనసాగిన వైద్య శిబిరం
పెదబయలు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ ఆధ్వర్యంలో గ్రామంలో రెండో రోజు కూడా వైద్య శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా సుమారు 70 మందికి రక్తనమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో ఎవరికై నా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే 108కి లేదా సంబంధిత వైద్యులకు ఫోన్ చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.


