అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత

Jun 23 2026 1:16 AM | Updated on Jun 23 2026 1:16 AM

● కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ● పీజీఆర్‌ఎస్‌ అర్జీలు మొత్తం – 307

తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌ అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలోని పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమెతోపాటు జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, ఇన్‌చార్జి డీఆర్వో శ్రీనివాస్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలన్నారు. తద్వారా అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. అర్జీలు పునరావృతం అయ్యిందంటే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం పీజీఆర్‌ఎస్‌కు– 135 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌కు– 172 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

దివ్యాంగుల సహాయ పరికరాల నిల్వకు భవనం కేటాయించాలి

నూతనంగా ఏర్పడిన జిల్లాలో నేటికి దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం విజయనగరం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించడం దారుణమని, దివ్యాంగులకు అవసరమైన వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చంక కర్రలు, కృత్రిమ అవయవాలు, ఇతర సహాయక పరికరాల కోసం ఆ జిల్లా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల రవాణా ఖర్చులు ఎక్కువ అవ్వడం, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూక అప్పారావు పీజీఆర్‌ఎస్‌లో వినతి అందించారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ శాశ్వత కార్యాలయం ఏర్పాటయ్యే వరకు అనకాపల్లిలో దివ్యాంగుల పరికరాలు నిల్వ ఉంచుటకు తాత్కాలిక భవనాన్ని కేటాయించాలంటూ అధికారుల వద్ద మొర పెట్టుకున్నారు. దివ్యాంగులైన ఎస్‌.సిద్ధుకు ట్రై సైకిల్‌, జి.సాయికుమార్‌కు వీల్‌ చైర్‌ మంజూరు చేయాలని కోరారు.

ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు వ్యతిరేకంగా రైతుల ధర్నా

కె.కోటపాడు మండలం గొండుపాలెం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వం చేపడుతున్న భూ సర్వే నిలిపివేయాలని, ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి ఈర్లె నాయుడుబాబు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ పార్క్‌ కోసం ఎటువంటి గ్రామసభ నిర్వహించకుండా తహసీల్దార్‌ కార్యాలయానికి కొంతమంది రైతులను రప్పించుకుని భయపెట్టి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తున్నారని, ఇది దుర్మార్గపు ఆలోచన అన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రైతులను బెదిరిస్తున్నారని, దీన్ని ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిపారు. గొండుపాలెం సమీపంలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు చేసిన శంకుస్థాపనను వెంటనే విరమించుకోవాలని, లేదంటే దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌. నాయుడు, ఆర్‌. రామకృష్ణ, ఆర్‌.మణి, ఈశ్వరరావు, దొగ్గ మహేష్‌, ఆర్‌. భారతి, బి.తారకేశ్వరకుమార్‌, రొంగలి మోహన్‌కుమార్‌, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement