మహారాణిపేట: పెందుర్తి మండలం రాణివారి కల్లాలు (సర్వే నెంబర్ 107/11) పరిధిలోని పేద ప్రజల నివాసాలపై టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, భూ కబ్జాలను కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. లక్ష్మి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి బాధితుడు కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాణివారి కల్లాల్లో దాదాపు 40 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నాయని, ఆ ఇళ్లను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. గండి బాబ్జీ అనుచరులు జేసీబీలతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేస్తూ దౌర్జన్యానికి తెగబడుతున్నారని, దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి పేదలకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఎస్. వెంకటలక్ష్మి, ఈసరాపు లక్ష్మి పాల్గొన్నారు.


