సీతంపేట: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఆశ్రిత ప్రయోజనం (డిపెండెంట్ బెనిఫిట్) ఒక ముఖ్యమైన ప్రయోజనమని సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ అన్నారు. ఉద్యోగ నిర్వహణ సమయంలో, ఉద్యోగ సంబంధిత ప్రమాదాల కారణంగా మరణించిన బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద నెలవారీ పింఛను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంబంధిత ప్రమాదాల్లో మరణించిన గాజువాక ఈ.ఎస్.ఐ బ్రాంచ్ ఆఫీసు పరిధిలోని ముగ్గురు బీమా కార్మికుల కుటుంబ సభ్యులకు నగరంలోని ఈఎస్‌ఐసీ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆశ్రిత ప్రయోజనం కింద మంజూరైన పింఛను చెక్కులు అందజేశారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో పనిచేస్తూ వేగి వెంకట కృష్ణ గుండెపోటుతో మృతి చెందగా అతని భార్య, కుటుంబ సభ్యులకు నెలకు రూ.21,204లు ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరు చేశారు. నాగార్జున వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న ఎం.నాగార్జున రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా అతని భార్యకు పార్వతికి నెలకు రూ.10,479 పెన్షన్ మంజూరు చేశామన్నారు. తులసి ఇంజినీరింగ్ వర్క్స్ సంస్థలో కాంట్రాక్ట్ ప్రతినిధిగా ఉక్కు కర్మాగారంలోని ఎంజీఎం యార్డ్‌లో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందిన కె.సూర్యారావు భార్యకు భవానికి నెలకు రూ.12,388 ఆశ్రిత ప్రయోజన పింఛను మంజూరైందన్నారు. ఈ సందర్భంగా జేడీ కేఆర్ రవి కుమా ర్ మాట్లాడుతూ ఉద్యోగ సంబంధిత ప్రమాదాల వల్ల బీమా కార్మికుడు మరణించిన సందర్భంలో, అర్హులైన కుటుంబ సభ్యులకు కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా ఆశ్రిత ప్రయోజన పింఛను, బకాయి చెల్లింపులు, ఇతర చట్టబద్ధమైన సంక్షేమ ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ఈఎస్‌ఐసీ కట్టుబడి ఉందని తెలిపారు. మృతి చెందిన బీమాదారుని భార్యకు రూల్ 25 (10) సోషల్ సెక్యూరిటీ సెంట్రల్ రూల్స్ 2026 ప్రకారం నామమాత్రపు రుసుముతో నెలకు రూ. 50 చొప్పున సంవత్సరానికి రూ. 600 ముందస్తు చెల్లింపుతో ఈ.ఎస్.ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్స్‌లో వైద్య సదుపాయం పొందవచ్చున్నారు. మృతి చెందిన బీమాదారుని పిల్లలకు ఈఎస్‌ఐసి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లలో నీట్ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ప్రకారం ప్రత్యేక కోటాకు అర్హత లభిస్తుందన్నారు. ఆయా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.


