ఆనందపురం: స్నేహితులతో కలిసి సరదాగా సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు రిజర్వాయర్‌లో మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొట్టుముక్కల శ్రీధర చక్రవర్తి (28) సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తన స్నేహితులు ప్రశాంత్, శౌవిక్ చౌదరీతో కలిసి గంభీరం రిజర్వాయర్‌కు వెళ్లాడు. ముగ్గురూ కలిసి ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. అయితే లోపలికి వెళ్లే కొద్దీ లోతు పెరగడంతో శ్రీధర చక్రవర్తి నీటిలో మునిగిపోయాడు. మిగిలిన ఇద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆనందపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం భీమిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుడి తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గొట్టుముక్కల మధు జగన్నాధ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సీఐ సీహెచ్.వాసు నాయుడు ఆదేశాలతో ఎస్‌ఐ ఎం.హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


