● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య
● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పెదబయలు : కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందని, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం చాణక్య ఆరోపించారు. పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ బొడ్డాగొంది గ్రామానికి చెందిన అనుగూరు కోటిబాబు కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, పచ్చకామెర్ల బారిన పడి, అనుగూరు మేరీ (9), ఆమె తమ్ముడు అనుగూరు జీవన్‌రాజు (7) చికిత్స అందక 12 గంటల వ్యవధిలోనే మృతి చెందడం ఎంతో బాధాకరమని చాణక్య ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో వైద్యం అంది ఉంటే చిన్నారులు ప్రాణాలతో ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 19న గోమంగి పీహెచ్‌సీ సిబ్బంది నిట్టాపుట్టు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి, కోటిబాబు అక్కడికి వెళ్లి తమ పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, గ్రామానికి వచ్చి వైద్యం అందించాలని ప్రాధేయపడ్డారని చాణక్య వివరించారు. అంతేకాదు, వైద్యులను తీసుకురావడానికి ఆటో కూడా ఏర్పాటు చేస్తానని కోరినా, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. ఒకవేళ అప్పుడే స్పందించి ఉంటే చిన్నారుల మృతిని ఆపగలిగేవారని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నారుల మృతి విషయం తెలుసుకున్న రేగం చాణక్య హుటాహుటిన గ్రామానికి వెళ్లి, అస్వస్థతతో బాధపడుతున్న ఇతర కుటుంబ సభ్యులను మెరుగైన వైద్యం కోసం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, చిన్నారులను కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, అరకు మండల ఎస్టీ సెల్ నాయకులు పాంగి నాగేశ్వరరావు, బొంగరం, గుల్లేలు మాజీ సర్పంచ్ ఉడ్డు లక్ష్మీపతి, సాగేని నాగరాజు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత తెరవాడ వెంకటరావు పాల్గొన్నారు.


