● నోరు మెదపని కూటమి ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శ
పాడేరు: దట్టమైన అటవీ ప్రాంతంలోని అపారమైన బాకై ్సట్ ఖనిజ సంపదను దోచుకునేందుకు రహస్యంగా సర్వేలు జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? బాకై ్సట్ తవ్వకాల విషయంలో మీ వైఖరేమిటో వెంటనే స్పష్టం చేయాలి.. అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గూడెంకొత్తవీధి మండలం జర్రెల బాకై ్సట్ కొండపై ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తూ గిరిజనులకు దొరికిపోవడంతో అసలు విషయం బయటపడిందని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే గిరిజన సంపదను దోచుకుంటారని మేము ముందే హెచ్చరించాం, ఇప్పుడు అదే జరుగుతోంది.. అని ఆమె ఆరోపించారు. ఐదో షెడ్యూల్డ్ ఏరియాలోని ప్రత్యేక అధికారాలను, చట్టాలను ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని, స్థానిక అధికారులు దీనిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా జీవో నంబర్ 97ను పూర్తిగా రద్దు చేశామని, దీంతో ఏజెన్సీలో ఇక బాకై ్సట్ తవ్వకాల ఊసే ఉండదని గిరిజనులు ప్రశాంతంగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న రహస్య సర్వేలతో మళ్లీ గిరిజనుల్లో ఆందోళన మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంపదను, భూములను కాపాడుకునేందుకు స్థానిక గిరిజనులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే, కూటమి నేతలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గిరిజన సంపదను అడ్డదారిలో దోచుకునే హక్కు ఏ సంస్థకు, ప్రభుత్వానికి లేదన్నారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో గిరిజనుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు.


