ప్రమాద స్థలంలో కాలి బూడిదైన దుస్తులు, గృహ సామగ్రి
రోలుగుంట: స్థానిక యాతవీధిలో బొందల సుబ్బలక్ష్మి ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుస్తులు, గృహ సామగ్రి, ఖాతాదారులకు కుట్టాల్సిన కొత్త దుస్తులు కాలి బూడిదయ్యాయి. సుబ్బలక్ష్మి దర్జీ వృత్తి చేసుకుంటూ తన ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటోంది. శనివారం రాత్రి ఇంట్లో దీపం వెలిగించి పొరుగింటికి పని మీద వెళ్లింది. ఇంతలో ఇంట్లో నుంచి మంటలతోపాటు పొగ రావడంతో వెంటనే వచ్చి తలుపులు తీయగా, దుస్తులు, ఫర్నిచర్, తదితర గృహ సామగ్రి కాలి బూడిదయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. వీఆర్వో ఎస్.కుమారి సంఘటనా స్థలాన్ని పరిశీలించి రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ప్రభుత్వ పరిహారం కోసం నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తానని వీఆర్వో తెలిపారు.


