అచ్యుతాపురం ఏఈ శ్రీనివాసరావు
అచ్యుతాపురం రూరల్: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ అచ్యుతాపురం ఏఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ విషయమై ఆదివారం ఆయన అవగాహన కల్పించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాలు, ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడి రోడ్లపై, నీటిలో పడే ప్రమాదముందని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే ప్రజలు అధికారులకు సమాచారం అందించాలి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు ఆనుకున్న చెట్లు, ఇతర వస్తువులను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇళ్లలో తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లు, పరికరాలను ఉపయోగించకూడదు. పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి. ఎటువంటి విద్యుత్ ప్రమాదం, లోపం గమనించినా వెంటనే టోల్ ఫ్రీ 1912 నంబరుకు సమాచారం ఇవ్వాలి. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలు, ఆస్తులను కాపాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్యఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన’ను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి. ఇంటి పైకప్పులపై సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుంది. అర్హులైన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీ అందిస్తుంది. సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకున్నాక ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్వీయ అవసరాలకు వినియోగించుకోవాలి. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిందని, ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు పొందవచ్చునని ఏఈ తెలిపారు.


